ఏపీ అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ రోజు సాయంత్రం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తన నియోజకవర్గ సమస్యలను ఆయనకు వివరించారు.
కేంద్రంలో లేదా రాష్ట్రంలో.. ఎక్కడైనా సరే.. అధికారంలో ఒక పార్టీ ఉంటే.. ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల సమస్యల గురించి అధికారంలో ఉన్న పార్టీ నేతలను కలుస్తుంటారు. తమ ప్రాంత అభివృద్ధికి కావల్సిన నిధులు అడగడమో, ప్రయోజనాలు కల్పించమని కోరడమో చేస్తుంటారు. అయితే టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కూడా సరిగ్గా ఇదే పంథాలో వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న తన నియోజకవర్గంలో ఉన్న గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించాలని సీఎం జగన్‌కు ఆయన లేఖ రాయగా.. ఇవాళ ఏకంగా జగన్‌ను కలిసి తన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమైన విషయం విదితమే. కాగా సమావేశాల అనంతరం ఈ రోజు సాయంత్రం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తన నియోజకవర్గ సమస్యలను ఆయనకు వివరించారు. పోలవరం ప్రధాన కుడికాలువ పూర్తి కావడానికి సహకరించిన రైతులను ఆదుకోవాలని, వారి మోటార్లకు కరెంట్ ఇవ్వాలని కోరారు. అలాగే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, వారు పొలాలకు నీరు పెట్టుకునే అవకాశం కల్పించాలని కోరారు. రైతులకు నీళ్లు ఇచ్చేందుకు తాను వారి కోసం ఏర్పాటు చేసిన 500 మోటార్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని వంశీ తెలిపారు. ఈ క్రమంలోనే కృష్ణా డెల్టాను కాపాడాలని కూడా వంశీ జగన్‌ను కోరారు.
కాగా సీఎం జగన్‌కు ఇచ్చిన లేఖలను మంత్రులకు కూడా పంపించానని ఎమ్మెల్యే వంశీ తెలిపారు. అన్నదాతల సమస్యలను అర్థం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన సీఎం జగన్‌ను కోరారు. కాగా ఇందుకు జగన్ సానుకూలంగా స్పందించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే వంశీ మోహన్ జగన్‌ను కలవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.