టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారా ? నిన్నటికి నిన్న ఆయన హైదరాబాద్ నుంచి ప్రెస్‌మీట్ పెట్టి జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని ఇందుకు తాను 48 గంటలు డెడ్‌లైన్ పెడుతున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. కేవలం తమ ఎమ్మెల్యేలు మాత్రమే రాజీనామా చేయడం ఎందుకు ? మొత్తం అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి మళ్లీ జగన్ గెలిస్తే తాను ప్రజల తీర్పును శిరసావహించి… జగన్ రాజధాని వికేంద్రీకరణకు ఓకే చెపుతానని చెప్పిన సంగతి తెలిసిందే.
సరే చంద్రబాబు సవాల్ ఎలా ఉన్నా.. ఆయన పార్టీ ఎమ్మెల్యేల్లో సగం మంది కూడా ఆయన వెంట రాని పరిస్థితి ఉందని టీడీపీ వర్గాలే చెపుతున్నాయి. గత యేడాది జరిగిన ఎన్నికల్లో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు బాబుకు దూరం జరిగారు. మిగిలిన 20 మందిలో చంద్రబాబు, ఆయన వియ్యంకుడు బాలయ్యకు పార్టీలో ఉండక తప్పని పరిస్థితి. వీరు ఎటూ పోలేరు. మిగిలిన వారిలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు లాంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తే మిగిలిన ఎమ్మెల్యేలు తమ వ్యాపారాలు, ఇతర అవసరాల నేపథ్యంలో ఎప్పుడు అయినా పార్టీ నుంచి బయటకు రావొచ్చంటున్నారు.
వాస్తవానికి కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ఈ ఎమ్మెల్యేలు గెలిచి యేడాది కూడా కాలేదు. అప్పుడే ఎన్నికలకు వెళితే మళ్లీ కోట్లు ఖర్చు పెట్టేంత సీన్ చాలా మంది దగ్గర లేదు. ఈ యేడాదిలో జగన్ సంక్షేమ కార్యక్రమాలతో వైసీపీ మరింత బలపడిందన్న అంచనాలు ఉన్నాయి. ఈ టైంలో చంద్రబాబు రాజధాని సెంటిమెంట్‌ను నమ్ముకుని ఆయన మాట విని రాజీనామా చేస్తే ఓ నలుగురైదుగురు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదు. చంద్రబాబు జగన్‌కు అనవసరంగా 48 గంటల టైం ఇచ్చి వీరావేశాలు వేశారని.. జగన్ పొరపాటున తమ ఎమ్మెల్యేల్లో కొందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళదామంటే తమ పరిస్థితి ఏంటని వారు చర్చించుకుంటోన్న పరిస్థితి నెలకొంది.
ఇప్పుడున్న అంచనాల ప్రకారం టీడీపీకి ఉన్న 20 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబు వెంట నలుగురైదుగురు ఎమ్మెల్యేలు మినహా ఎవ్వరూ వెంట వచ్చే పరిస్థితి లేదంటున్నారు. దీనిని బట్టి చంద్రబాబును సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఏ మాత్రం నమ్మడం లేదని అర్థమవుతోంది.