పంచాయతీ ఎన్నికలు రావడంతో టీడీపీ ఎమ్మెల్యేలలో కొత్త టెన్షన్‌

-

పంచాయతీ ఎన్నికలు టీడీపీ నేతలకు కొత్త సమస్యలు తీసుకొస్తున్నాయంట. ఇప్పటికే ఏకగ్రీవాలకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చెస్తూండటం మరో పక్క ఆర్దిక కష్టాలు ఇంకో వైపు టార్గెట్ చేస్తూ అధికార పార్టీ కొత్త ప్యూహాలు రచిస్తుండటంతో మళ్లీ టార్గెట్ అవుతున్నామన్న భయం ముగ్గురు ఎమ్మెల్యేలను వేధిస్తుందట..ప్రభుత్వం ప్రయోగించిన సామదానభేద దండోపాయాలను ఇప్పటి వరకు తట్టుకున్న వీరు ఈ గండం గట్టెక్కడం ఎలా అని పునరాలోచనలో పడ్డారట.

ప్రకాశం జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో ఒకరు అధికార పార్టీ గొడుకు కిందకు వెళ్లిపోయారు. కొందరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి సైతం సేఫ్‌ జోన్‌ కోసం వైసీపీ కండువా కప్పేసుకున్నారు. అన్ని ఒత్తిళ్లను తట్టుకుని టీడీపీ శిబిరంలోనే ఉండిపోయారు మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు. ఈ సమయంలో వారి వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఆర్థికంగా నష్టపోయారు. అయినా మనసు మార్చుకోలేదు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రావడంతో మళ్లీ ఆ ఎమ్మెల్యేలలో టెన్షన్‌ మొదలైందట.

ప్రకాశం జిల్లాలో చీరాల, కొండపి, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి జైకొట్టారు. మాజీ మంత్రి శిద్ధారాఘవరావుతోపాటు మరికొందరు సైతం వైసీపీ కండువా కప్పేసుకున్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి టీడీపీని వీడలేదు. కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు సైతం అలాగే ఉన్నారు. వీరిలో గొట్టిపాటి రవి, పోతుల రామారావు గ్రానైట్‌ వ్యాపారాలపై అనేకసార్లు విజిలెన్స్‌ దాడులు జరిగాయి. వందల కోట్ల జరిమానా విధించారు. వ్యాపారాలు మూతపడి వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి.

ఈ కష్టాల నుంచి బయటపడే మాట దేవుడెరుగు అని అనుకుంటున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు రావడంతో మళ్లీ కష్టాలు షూరూ. పంచాయతీ ఎన్నికల కోసమో లేక ఇంకేదో కారణమో.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట, ప్రకాశం జిల్లా మార్టూరు వద్ద గొట్టిపాటి రవికి ఉన్న ఫ్యాక్టరీలలో మళ్లీ సోదాలు జరిగాయి. మూతపడినవి మూతపడగా.. ఈ ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్‌ కటింగ్‌ ఫ్యాక్టరీలే ఆయనకు ప్రస్తుతం అరకొర ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇప్పుడవి కూడా మూత పడ్డాయి.

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకి చెందిన నోవా అగ్రిటెక్ సంస్థ ప్రొడక్ట్స్ అమ్మకాలను ఏపీలో ఎప్పుడో నిలిచిపోయాయి. దాంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అని ముహూర్తలు ఫిక్స్‌ అయ్యాయి. కానీ.. టీడీపీ హైకమాండ్‌ ఇచ్చిన హామీతో ఆగిపోయారు. దీంతో ఆయన కంపెనీ అమ్మకాలు జరగట్లేదు. మరి.. వ్యాపారం కోసం సాంబశివరావు మనసు మార్చుకుంటారో లేక ఇక పోయేది ఏం లేదని దూకుడుగా వెళ్తారో అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైతే ఆయన టీడీపీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గానే పాల్గొంటున్నారు.

పంచాయతీ ఎన్నికలు రావడంతో టీడీపీ ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకే అధికార పార్టీ పావులు కదుపుతున్నట్టు రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. గత ఏడాది జడ్పీ ఎన్నికల్లో అద్దంకిలోని సంతమాగలూరు, కొండపిలోని సింగరాయకొండ, కందుకూరులోని కందుకూరు జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. అద్దంకిలో 103, పర్చూరులో 95, కొండపిలో 111, కందుకూరులో 92 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని అధికారపార్టీ టార్గెట్ పెట్టుకుంది.

మరి.. ఏకగ్రీవాలపై వైసీపీ నుంచి ఎదురయ్యే ఇబ్బందులు,సొంత పార్టీ నేతలకు ఎలా సర్దిచెప్పాలన్న దాని పై టీడీపీ ఎమ్మెల్యేలు మదనపడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news