ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు ప్రవేశపెడుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ పై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని ప్రతిపక్ష టిడిపి పట్టుబట్టింది. ప్రశ్నోత్తరాల సమయం తరువాత మాట్లాడుతామని స్పీకర్ ప్రకటించారు. అయినా వినకుండా జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ గా మారింది అంటూ టిడిపి సభ్యులు సభలో నినాదాలు చేశారు. స్పీకర్ క్వశ్చన్ అవర్ తర్వాత మాట్లాడుదామని ఎన్నిసార్లు చెప్పినా.. టిడిపి సభ్యులు వినలేదు.
స్పీకర్ పోడియం పైకి ఎకి వాగ్వాదానికి దిగడంతో సభ పది నిమిషాల పాటు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు టిడిపి నేతలు యత్నిస్తున్నారని విమర్శించారు. టిడిపి సభ్యుల తీరు చూస్తుంటే సస్పెండ్ కావాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తమ ప్రశ్నలకు కూడా సమాధానం వినే ఉద్దేశం లేదని.. వీరిని సస్పెండ్ చేయకపోతే సజావుగా సాగే పరిస్థితి లేదన్నారు.