టీడీపీ ఎమ్మెల్సీ నారా లేకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షాస్థలికి నారా లోకేష్ వెళ్లారు. దీక్షకు సంఘీభావం ప్రకటించిన అనంతరం ఆయన అక్కడి నుంచి బయల్దేరారు. తిరిగి వస్తున్న సమయంలో కనకదుర్గమ్మ వారధి వద్ద లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లోకేశ్ తో పాటు అదే వాహనంలో ప్రయాణిస్తున్న టీడీపీ నేత, ఎమ్మెల్యే రామానాయుడును, మరో ఇద్దరు నేతలను కూడా అరెస్ట్ చేశారు. అయితే, రాస్తారోకో వైపు వెళ్తున్నాడని.. అందుకే ఆయన్ను అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, టీడీపీ శ్రేణులు ఈ అంశంపై మాట్లాడుతూ, పార్టీ ఆఫీసుకు వెళ్తున్నానని లోకే చెబుతున్నప్పటికీ పోలీసులు వినకుండా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.