ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీగా ఉన్న వైసీపీకి సహకరించిన సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం ఇప్పుడు కాషాయ జెండా కప్పుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి.తాజాగా మోహన్ బాబు ఫ్యామిలీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడిని కలిసిన సంగతి తెలిసిందే. తన కుమార్తె మంచు లక్ష్మీ, కుమారుడు విష్ణుతో కలిసి మోహన్ బాబు ప్రధాని వద్దకు వెళ్ళారు.
వెళ్తే వెళ్ళారు గాని వాళ్ళు ఇప్పుడు ఎం చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి మోహన్ బాబు ఇప్పుడు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. జగన్ రాజ్యసభకు పంపిస్తారనే ఆశలు పెట్టుకున్నారు ఆయన. కాని జగన్ నుంచి ఆ స్పష్టత మోహన్ బాబుకి రావడం లేదు. జగన్ అధికారంలోకి రావడానికి గాను ప్రచారం కూడా చేసారు మోహన్ బాబు. ఆ తర్వాత చంద్రబాబు మీద కూడా అనేక విమర్శలు చేస్తూ వచ్చారు.
దీనితో జగన్ నుంచి భారీగానే ఆశించారు కలెక్షన్ కింగ్. జగన్ నుంచి ఏ స్పందనా రాకపోవడంతో తన కుటుంబంతో కలిసి బిజెపిలో చేరాలని భావిస్తున్నారట. దాదాపు 45 నిమిషాల పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. బీజేపీలో చేరాల్సిందిగా మోహన్ బాబును మోదీ ఆహ్వానించారని.. ఆయన బీజేపీలో చేరే అవకాశముందని అంటున్నా… మరొక వ్యాఖ్య కూడా వినపడుతుంది. ఫీజు రియంబర్స్ మెంట్ నిధులను ఏపీ ప్రభుత్వ౦ ఆపడంతోనే మోడీని ఆయన కలిసారని సమాచారం. జగన్ వద్దకు వెళ్ళినా ప్రయోజనం లేకపోవడంతోనే మోడీ వద్దకు వెళ్లినట్టు తెలుస్తుంది.