చంద్రబాబు తనయుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నారా లోకేష్.. మంత్రిగా కూడా రెండున్నరేళ్లపాటు చక్రం తిప్పారు. ఇప్ప టికీ.. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయినా కూడా ఇప్పటికీ.. తనకంటూ.. ప్రత్యేక రాజకీయ కోరంను ఏర్పాటు చేసుకోలేక పోయారు. తండ్రి చాటు బిడ్డగానే ఉండిపోయారు. అయితే, ఇప్పుడు ఆయన గురించి ఆసక్తికర సంభాషణ ఒకటి టీడీపీ తమ్ముళ్ల ఫోన్లలో మార్మోగుతోంది. నిజానికి లోకేష్ ను మొన్నటిదాకా సొంత పార్టీ నేతలే చాటు మాటుగా ఎగతాళి చేశారు. లోకేశ్ కు తెలుగు మాట్లాడటం రాదన్నారు. కనీసం మంగళగిరి అని పలకటం కూడా రాదని ఎద్దేవా చేశారు. ఇవన్నీ లోకేశ్ లో పౌరుషం, పట్టుదలని పెంచాయో ఏమో తెలియదు గానీ.. ఈ లాక్ డౌన్ సమయం మాత్రం ఆయనకు బాగా కలిసొచ్చింది.
రెండు నెలల కాలంలోనే 20 కిలోల బరువు తగ్గడంతోపాటు తెలుగు భాషను నేర్చుకోవటం, ధారాళంగా మాట్లాడటంపై ఆయన శ్రద్ధ పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా లోకేషే చెప్పారు. అంతేగాక ప్రసంగ శైలి మార్పుపై కూడా సాధన చేశారు. అందుకే ఆయన ప్రసంగాలు గతానికి, ఇప్పటికీ భిన్నంగా సాగుతున్నాయి. ఇటీవల మహానాడులో, అనంతరం అనంతపురం జిల్లాకు జేసీ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో, తెలుగుదేశం పార్టీ చార్జ్ షీట్ విడుదల చేసిన సమయంలో ప్రసంగ విధానంలో తేడా స్పష్టంగా కనిపించింది. ఉపన్యాసంలో పొరపాట్లు దొర్లకుండా, భాషలో పొందిక, పదాల్లో కరుకుదనం కనిపించాయనీ, మాటల్లో వేగం పెరిగిందనీ, కసి కనిపిస్తోందని టీడీపీ నాయకులు ఇప్పుడు చెప్పుకొంటున్నారు.
సహజంగా పోరాటాలు, ఉద్యమాల నుంచి నాయకులు ఎదుగుతారు. న్యాయకత్వాన్ని నిరూపించుకునేందుకు ప్రతిపక్షంలో మంచి అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణ రూపొందించడం, కార్యకర్తలను సంసిద్ధం చేయడం, ప్రభు త్వంపై ఒత్తిడి పెరిగేలా పోరాటం ఉధృతం చేయడం, చట్టసభల్లో నిలదీయడం వంటివి ప్రతిపక్షంలోనే సాధ్యమవుతోంది. ఈ సమయంలోనే కార్యకర్తలు, నేతలను ఎక్కువగా కలుసుకునే అవకాశం ఉంటుంది.
పార్టీ పదవులు మినహా అధికార పదవులు ఉండవు కాబట్టి.. అధికారాన్ని అందుకోవటమే లక్ష్యంగా పోరాటాలు సాగుతాయి. ప్రస్తుతం లోకేష్ ఈ దిశగానే పావులు కదుపుతున్నారని తమ్ముళ్లు చెప్పుకొంటున్నారు. అయితే, ఇది వాపో.. బలుపో.. అనేది మాత్రం తేలాలంటే.. వచ్చే ఎన్నికలకు వెయిట్ చేయాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు. అప్పుడు కదా.. అసలు సిసలు సత్తా తేలేది అని చెబుతున్నారు.