రాజధాని అమరావతి విషయంపై అధికార పార్టీ వైఎస్సార్ సీపీతో అమీతుమీ తేల్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ సీపీ సహా అందరూ రాజీనామాలు చేసి ప్రజాతీర్పు కోరాలని ఇప్పటికే ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. పైగా ఎద్దేవా చేస్తూ.. మంత్రులు చంద్రబాబును తిట్టిపోశారు. ఇదిలావుంటే, సొంత పార్టీ నుంచి కూడా బాబు దూకుడు తమ్ముళ్లు పగ్గాలు వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. వైఎస్సార్ సీపీ నేతలు రాజీనామాలకు సిద్ధపడడం లేదు కాబట్టి.. తమ పార్టీ తరఫున అయినా.. అమరావతికోసం రాజీనామాలు చేయాలని చంద్రబాబు యోచన.
అంటే, అమరావతి కోసం గట్టిబాణీ వినిపిస్తున్నదీ రాష్ట్ర ప్రయోజనాల కోసం నడుంబిగించిదీ తామే నని చెప్పుకొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 23 మందితో రాజీనామాలు చేయించాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే రంగంలొకి దిగిన పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. అవసరమైతే.. రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని కూడా ఆయన తెలిపినట్టు పార్టీలోనే చర్చ నడుస్తోంది. అయితే, టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ససేమిరా అంటున్నారని తెలుస్తోంది.
ఎన్నికలు గడిచి కేవలం రెండేళ్లు కూడా కాలేదు. ఇప్పుడు రాజీనామాలు చేయడం అంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారట. ఏదైనా ఉంటే చంద్రబాబు చేస్తే.. సరిపోతుందని, కోట్లకు కోట్లు ఖర్చు పెట్టుకుని పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని భావించి పోటీ చేసి అతి కష్టం మీద గెలుపు గుర్రం ఎక్కామని,, రేపు అమరావతి సెంటిమెంటు లేకపోతే.. తాము ఓడిపోతే.. పరిస్థితి ఏంటని కూడా వారు ప్రశ్నిస్తున్నట్టు తమ్ముళ్ల మధ్య చర్చ నడుస్తోంది. దీంతో చంద్రబాబు దాదాపుగా ఈ రాజీనామాల ప్రతిపాదనను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తమ్ముళ్లే ఇప్పుడు బాబుకు పగ్గాలు వేయడం ఆసక్తిగా మారింది. ఏం జరుగుతుందో చూడాలి.