ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో వైసీపీ పరిపాలనలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి అని భావిస్తున్నమాజీ సీఎం చంద్రబాబు నేటి నుండి సమర శంఖం పూరిస్తున్నారు. తొమ్మిది నెలలు.. తొమ్మిది మోసాలు.. తొమ్మిది రద్దులు.. తొమ్మిది భారాలు అంటూ ఎజెండా సిద్దం చేసి రంగంలోకి దిగుతోంది విపక్ష తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరులో ప్రజాచైతన్యయాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరగనున్న యాత్రల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ప్రజలను భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కాగా, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఉన్న పరిస్థితులను, ఏపీ వెనుకబడుతున్న తీరును ఆయన ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలని ప్రజా చైతన్య యాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది టీడీపీ. నేటి నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్ర చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది . ఇక ఈ యాత్ర సుమారు 45 రోజుల పాటు ఇది కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఇలా మొత్తానికి జగన్ తొమ్మిది నెలల పాలనపై తొమ్మిది మోసాలు, భారాలు, రద్దులు అంటూ వైసీపీ పాలనను కళ్ళకు కట్టినట్టు చెప్పటానికి సిద్ధం అవుతున్నారు చంద్రబాబు.