పిల్లలూ ఉపాద్యాయుడూ అనేక ఆసక్తులతోటీ, సరదాల తోటీ, మిళితమైపోయి పిల్లల సాముదాయిక, ఆధ్యాత్మిక జీవితం వికసించే చోటే నిజమైన పాఠశాల అని నా నమ్మకం. పాఠం చెప్పేటప్పుడు మాత్రమే పిల్లలని చూసే వ్యక్తి- బల్లకిటువైపు తనూ, అటువైపు పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్లని చూసే వ్యక్తి – పిల్లల హృదయాలను గ్రహించలేడు. మరి పిల్లల హృదయం గ్రహించని వ్యక్తి , వాళ్ల ఆలోచనలూ, భావాలు, కోరికలు పసికట్టలేనివాడు ఎవరైనా సరే ఉపాధ్యాయుడు కాలేడు ‘ అని ప్రఖ్యాత రష్యన్ బోధకుడు సుహోమ్లీన్‌స్కీ అంటాడు.
ఈ మాటలతో ప్రస్తుతం మన పాఠశాలలను, ఉపాధ్యాయులను పోల్చుకుంటే.. అమ్మో.. మన పాఠశాలలు ఎటువైపు వెళ్తున్నాయి.. మన పిల్లలు ఏం కాబోతున్నారన్నది స్పష్టమే మరి. ఒక్కోసారి పాఠశాలలను, పిల్లలను తలచుకుంటూ నిద్రపోని తల్లిదండ్రులు ఎందరో చెప్పడం కష్టమేమరి. సెప్టెంబర్ 5న మనం గురుపూజోత్సవం జరుపుకుంటాం. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన భారత రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతినే ఇలా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
ఈ రోజు మన గురువులను పూజించుకుంటున్నాం.. పూలమాలలు, శాలువాలతో సన్మానించుకుంటున్నాం. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ.. మరో కోణాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం.. మన పాఠశాల వ్యవస్థలో, మన గురువులో ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. గాలి, వెలుతురు కూడా చొరబడని పాఠశాలలు ఎన్నో నేడు మనకళ్లముందు వేలు, లక్షలు, కోట్ల రూపాయలను ఫీజుల రూపంలో కొల్లగొడుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా పాఠశాలలు నిర్వహిస్తూ.. పిల్లలను బందీఖానాలో వేసినట్టుగా ఉంచుతున్న స్కూళ్లు ఎన్నో ఉన్నాయి. రకరకాల పేర్లతో అదనపు వసూళ్లే ధ్యేయంగా నడుస్తున్న పాఠశాలలు కోకొల్లలు.
తరగతి గదిలోకి రాగానే.. బోర్డులోనే ప్లాట్ల కొలతలు వేసుకుంటున్న రియల్ గురువులెందరో మన కళ్లముందు కదలాడుతున్నారు. తరగతి గది నుంచి అడుగుబయట పెడితేచాలు.. మళ్లీ తిరిగి వచ్చే దాకా పిల్లవాడితో ఎలాంటి ఆత్మిక బంధాలూ ఉండని ఉపాధ్యాయులెందరో మనకు అడుగడుగునా కనిపిస్తున్నారు. ఇలాంటి ఉపాధ్యాయుల చేతుల్లో ఎలాంటి పిల్లలు రూపుదిద్దుకుంటారో ఊహించుకుంటేనే తల్లిదండ్రులకు భయాందోళన కలగకమానదు.
వీరికి పిల్లల ఆధ్యాత్మిక ప్రపంచంతో సబంధం ఉండదు. వాళ్ల హృదయాలకు సంబంధం ఉండదు. వాళ్ల ఆలోచనలు, కోరికలు, భావాలతో సంబంధం ఉండదు. మరి ఇలాంటి ఉపాధ్యాయులు పిల్లలను భావి భారత పౌరులుగా ఎలా తీర్చిదిద్దుతారో అర్థం చేసుకోవచ్చు. అందుకేనేమో.. ఈ మధ్యకాలంలో గురువంటే పిల్లలుకు భారమైపోతున్నాడు. గురువంటే పిల్లల్లో అమ్మో.. అనే భావన పెరిగిపోతోంది. అయినా.. ఇప్పటికీ ఉపాధ్యాయ వృత్తిని పవిత్రమైనదిగా ప్రజలు చూస్తారు. ఎందుకంటే.. ఎందరో ఉపాధ్యాయులు తమ జీవితాలను పిల్లల కోసం అర్పిస్తున్నారు. ఈ బాధంతా ఎందుకంటే.. ఏ ఒక్క పిల్లవాడి వ్యక్తిత్వమైనా సరైన రీతిలో రూపుదిద్దుకోకుంటే.. అది భవిష్యత్‌లో విపరీత పోకడలకు దారితీస్తుంది కాబట్టి..!