- రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్తను చెప్పారు. రాష్ట్రంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. దీనిలో భాగంగా 50 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అలాగే, పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను అందిస్తామన్నారు. స్టడీ మెటీరియల్ సైతం ఇస్తామని తెలిపారు.
తాజాగా హరీశ్ రావు సిద్దిపేటలోని ప్రయివేటు టీచర్ల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ, మరీ ముఖ్యంగా ప్రయివేటు టీచర్ల పరిస్థితి దారుణంగా మారిందని పేర్కొన్నారు. వారి పరిస్థితులను గుర్తించే నిత్యవసరాల సాయం చేస్తున్నామనీ, ఇప్పటవరకు 10 వేల కుటుంబాలకు నిత్యవసరాలు అందించామని హరీశ్ రావు తెలిపారు.
అలాగే, సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకుందామనీ, ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే, స్వచ్ఛ సర్వేక్షణ్ ఓటింగ్‌లో పౌరులందరూ పాల్గొని… సిద్దిపేటకు ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.