కాసేపటి క్రితమే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ శాసన సభ, మండలి ఉభయ సభల్లో ఇవాళ మొదటగా ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు. చేపల పెంపకానికి ప్రొత్సాహం, దారిద్ర్య రేఖ దిగువన గల కుటుంబాలకు ఆహారభద్రత కార్డులు, పట్టణ మిషన్ భగీరథ పథకం కింద తాగునీరు లాంటి అంశాలపై సభ చర్చించనుంది.
అలాగే… కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులు, తెలంగాణ ఆర్టీసీ సరుకు రవాణా మరియు కొరియర్ సేవలు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ లాంటి వాటిపై శాసన మండలిలో చర్చ జరుగనుంది.
విశ్రాంత ఆచార్యులకు సవరించిన యుసి వేతన స్కేల్, ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, సేంద్రియ వ్యవసాయం, సోషల్ మీడియా మరియు యూట్యూబ్ లో పోస్టులు, న్యాయస్థానాలకు సొంత భవనాలు మరియు కల్వకుర్తి మండలం రామగిరి ఆలయ అభివృద్ధి లాంటి వాటిపై శాసనమండలిలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్వల్పకాలిక చర్చలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పై చర్చించనున్నారు. అలాగే ఇవాళ ద ఇండియన్ స్టాంపు బిల్ 2021 కి శాసన సభ ఆమోదం తెలపనుంది.