- ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించిన బండి సంజయ్
- కాళేశ్వరం డీపీఆర్ ఎందుకివ్వడంలేదంటూ ప్రశ్న
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. కాళేశ్వరానికి సంబంధించి కేంద్రం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కోరితే ఎందుకు ఇవ్వడం లేదంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం పర్యటన పేరుతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసగించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టు ఇక విఫల డిజైన్ అంటూ విమర్శించారు. ఈ ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగ పడది పేర్కొన్నారు. కోటి ఎకరాలకు నీరు అందిస్తామంటూ రాష్ట్ర ప్రజలను సీఎం మోసగించారన్నారు. ఇక మూడో టీఎంసీ, ప్రాజెక్టు డీపీఆర్ వివరాలు ఇస్తే వారి బండారం బయటపడుతుందని కేసీఆర్ భయపడుతున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా.. తాజాగా బండి సంజయ్ ట్వీట్టర్ వేదికగా టీఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. ”కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుంది. బండి సంజయ్ హిందువు కాదని డీఎన్ఏ టెస్ట్ చేయిచుకోవాలని సవాలు విసిరారు. నేను హిందువునని డీఎన్ఏ టెస్టు చేయించుకోవడానికి రెడీ.. మరి టీఆర్ఎస్ నేతలు అందుకు సిద్దమేనా?” అంటూ ట్వీట్ చేశారు.