తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముహుర్తం ఫిక్స్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ కానుంది. ఇది ఎన్నికల ఏడాది కావడంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి బడ్జెట్ రూపొందించాలని నిర్ణయించింది.
అయితే గతేడాది బడ్జెట్ సమావేశాలను మార్చి ఏడవ తేదీ నుంచి నిర్వహించగా, ఈసారి నెల ముందే జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్ని రోజులు నిర్వహించాలన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్రం కూడా 2023-24 బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. దాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సర్కారు భావిస్తోంది.