మేమూ ఈ-చలానాల బాధితులమే.. మండలిలో BRS ఎమ్మెల్సీలు

తెలంగాణ శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ఆసక్తికర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ట్రాఫిక్‌ ఈ-చలానాల అంశాన్ని ప్రస్తావించారు. హైవేల్లో 60 కి.మీ.ల వేగంతో వెళితేనే అధిక వేగం కింద ఈ-చలానా నమోదవుతోందని పేర్కొన్నారు. తన వాహనంపై ఇలాంటి చలానాలు అనేకం నమోదయ్యాయని వాటి ప్రతుల్ని ప్రదర్శించారు. వేగపరిమితిని 85-90 కి.మీ.లకైనా పెంచాలని కోరారు. ఈక్రమంలో అధికారపక్షానికి చెందిన పలువురు ఇతర సభ్యులు.. తామూ ఈ-చలానాల బాధితులమేనని సుభాష్‌రెడ్డి వాదనకు శ్రుతి కలిపారు.

హోంమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ.. అధికవేగం, మద్యం తాగి వాహనం నడపడం, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌, ఓవర్‌లోడింగ్‌ కారణాలతో రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నందునే కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నియమాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సిగ్నలింగ్‌ వ్యవస్థను యూరోపియన్‌ దేశాల తరహాలో ఐటీఎంఎస్‌ ప్రాజెక్టు కిందకు మార్చుతున్నట్లు తెలిపారు.