TRS TO BRS : ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ఇదే

-

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దసరా పర్వదినాన జాతీయ పార్టీగా అవతరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విజయదశమి మహోత్సవాన జాతీయ పార్టీని ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ను భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మారుస్తూ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానికి టీఆర్ఎస్ నాయకులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్‌ సభ్యులు, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు సహా 283 మంది కీలక ప్రతినిధులు ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాత వారంతా సంతకాలు చేశారు. తీర్మానం అనంతరం 1.19 గంటలకు కేసీఆర్‌ జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేశారు.

జాతీయ పార్టీకి కొత్త పేరు కోసం ఆయన దాదాపు 100 పేర్లకు పైగా పరిశీలించినట్లు సమాచారం. చివరకు ‘భారత్ రాష్ట్ర సమితి’ అనే పేరును ఫిక్స్ చేశారు.భారత్‌ రాష్ట్ర సమితి అనే పేరు తెలుగు వారితో పాటు హిందీలోనూ అర్థం అయ్యేలా సులభంగా ఉండడం వల్ల ఆ పేరు వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలిసింది. జాతీయ పార్టీ పెడతారని ఊహాగానాలు మొదలైనప్పటి నుంచి జాతీయ మీడియాలోనూ ఇదే పేరు దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డట్లు సమాచారం.

ఈ సమావేశానికి పలు రాష్ట్రాల నేతలు కూడా హాజరయ్యారు. కర్ణాటక మాజీ ముఖ్యమంతి, జేడీఎస్‌ నేత హెడీ కుమారస్వామి, ఆయన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్‌తో పాటు ఎంపీలు భేటీకి హాజరయ్యారు. బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా.. దేశ రాజకీయాల్లో మార్పు కోసం కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నానికి చాలా ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news