తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 44వేల 202 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1054 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 396 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 60 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 60 కేసులు, నల్గొండ జిల్లాలో 49, కరీంనగర్ జిల్లాలో 46 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 36 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 35 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 795 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 21వేల 671 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 11వేల 568 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 992గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 39వేల 320 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 771 మందికి పాజిటివ్ గా తేలింది.