ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి తో సమావేశమైన తెలంగాణ సిఎస్ సోమేశ్

-

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేడు న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఎ.గిరిధర్‌తో సమావేశమయ్యారు. రక్షణ భూములకు సంబంధించి దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రధానంగా కేంద్రరక్షణ కార్యదర్శితో చర్చించారు.

ఏఓసీ రోడ్ల మూసివేతకు బదులుగా ఏఓసీ పరిధిలో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. మెహిదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, లింక్ రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ కోసం కావాల్సిన రక్షణ శాఖ భూముల కేటాయింపుపై కేంద్ర రక్షణ కార్యదర్శి దృష్టికి సి.ఎస్. సోమేశ్ కుమార్ తీసుకెళ్లారు.

అనంతరం, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేష్‌ కె సింగ్‌తో సమావేశమై జాతీయ ఉపాధి హామీ పధకం క్రింద చెల్లింపు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సోమేశ్ కుమార్ చర్చించారు. రాష్ట్రంలో వరి అత్యంత ప్రధానమైన పంట అని, వరికోతల అనంతరం, రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు మేలుచేసేందుకై రైతు కళ్లాలను ప్రభుత్వం నిర్మించిందని కేంద్ర కార్యదర్శికి సి.ఎస్ సోమేశ్ కుమార్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news