కరోనా వైరస్ హైదరాబాద్ వచ్చిన నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. మంత్రి వర్గం ఉప సంఘం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. సాయంత్రం నాలుగు గంటలకు ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. కరోనా గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం లేదని, గాలి కారణంగా ఇతరులకు వచ్చే అవకాశం లేదని ఆయన అన్నారు. కరోనా పై అపోహలు, తప్పుడు ప్రచారాలు వద్దని సూచించారు.
కరోనా వచ్చినట్టు భావిస్తే అప్రమత్తంగా ఉండాలని అయన అన్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి తుంపర్ల తోనే వైరస్ వస్తుంది అన్నారు. కరోనా సోకినా వారు తుమ్మినా దగ్గినా మాత్రమే వస్తుంది అన్నారు. జలుబు వచ్చినట్టు భావిస్తే వైద్యులను కలవాలని, కరోనా వస్తే ఇతరులను తాకవద్దని ఆయన అన్నారు. అనుమానితులకు పరిక్షలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.
కరోనా సోకినా రోగుల్లో 3 శాతం మంది మాత్రమే చనిపోయారని అన్నారు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తెలంగాణాలో ఉన్న వారికి ఎవరికి కరోనా వైరస్ రాలేదని ఆయన అన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వచ్చిందని అన్నారు. వందల మంది ఉన్న చోట ఖర్చీఫ్ లు మాస్క్ లు వాడాలని మంత్రి సూచించారు. కరోనా గురించి ఏ ఆందోళనా అవసర౦ లేదని స్పష్ట౦ చేసారు.