ఇక నుంచి సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ : తెలంగాణ డీజీపీ

-

సోషల్ మీడియాలో పోస్టులపై నిఘా పెంచాలని పోలీసు అధికారులను డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. తప్పుడు పోస్టింగ్‌లపై తక్షణ చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పర్యవేక్షణ విభాగాన్ని పటిష్ఠం చేయాలన్నారు. ఠాణాలకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీల సమావేశాలు, పాదయాత్రలు ముమ్మరం అవుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు డీజీపీ సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఫిబ్రవరి నెలలో ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యటన బాగుందని కితాబిచ్చారు. రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరిగే హాట్‌స్పాట్లలో నియంత్రణ చర్యలతో పాటు రోడ్డు నిర్మాణ లోపాలను సవరించేందుకు రహదారులు, భవనాల శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు.

సైబర్‌ నేరాల విస్తృతి దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రతి ఠాణాలో పదిమంది చొప్పున సైబర్‌ యోధులను తయారు చేయాలని ఆదేశించారు. సైబర్‌నేరాల దర్యాప్తుపై నలుగురు కానిస్టేబుళ్లకు అధునాతన శిక్షణ ఇవ్వాలని సూచించారు. రంజాన్‌ మాసం నేపథ్యంలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధిలోని అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news