కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఎన్నో లక్షల మంది ప్రాణాలను బలితీసుంది. ఎన్నో కుటుంబాలను రోడ్డున నెట్టేసింది. మహమ్మారి బారిన పడి కోలుకున్న వాళ్లు కూడా ఇప్పటికీ ఆ వైరస్ సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడుతూనే ఉన్నారు. కరోనా సమయంలో ఎంతో మంది వైద్య సిబ్బంది తమ ప్రాణాలొడ్డి సేవలందించారు. కొందరు ఈ క్రమంలో ప్రాణాలు కూడా కోల్పోయారు.
అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి.. వైరస్ బారి నుంచి బయటపడటంపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ‘‘రెండున్నర ఏళ్ల నుంచి కొవిడ్ మహమ్మారి మానవజాతి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది. మనం అందించిన సేవల వల్ల కరోనా నుంచి బయట పడలేదు. ఏసుక్రీస్తు కృప, దయవల్లే కరోనా తగ్గింది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో డీహెచ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.