నిద్రలో తరచూ పీడకలలు వస్తున్నాయని.. సరిగ్గా నిద్రపట్టడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో చోటు చేసుకుంది. నిద్ర లేకపోవడం, పీడ కలలు రావడం వల్లే సూసైడ్ చేసుకుంటున్నట్లు బాధితుడు లేఖలో పేర్కొన్నాడు.
అసలేం జరిగిందంటే.. కులూ జిల్లాలోని బంజార్ ఏరియాలో ఓ 17 ఏళ్ల యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఈ అబ్బాయి వారం రోజుల నుంచి నిద్ర సరిగ్గా పోవడం లేదు. రాత్రి సమయాల్లో తరచూ భయపడుతూ లేచి కూర్చొనేవాడు. పీడకలలు పడుతున్నాయని ఆందోళన చెందేవాడు. తీవ్ర ఆందోళనకు గురైన ఈ విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి తన సోదరుడు విగత జీవిగా కనిపించాడని మృతుడి సోదరి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.