తెలంగాణాలో కరోనా లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులు పడకూడదు అని భావించిన రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులకు డబ్బులు, ఉచిత రేషన్ ని కేంద్రం సహకారంతో ఇస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వలన పనులు లేక ఇబ్బంది పడుతున్న వారు అందరికి కూడా ఇప్పుడు ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. ఎవరూ కూడా పస్తులు ఉండకూడదు అని భావించిన కేసీఆర్ ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే నగదు ఇస్తున్నారు.
ఒక్కొక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యాన్ని, రూ.1500 ఇస్తున్న తెలంగాణా ప్రభుత్వం గత నెలలో అందించింది. ఈ నెలలో కూడా నేటి నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఆహారభద్రత కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, ఒక్కోకార్డుపై రూ.1500 నగదు అందించాలని నిర్ణయం తీసుకుంది. అయితే నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ రూరల్, మెదక్ జిల్లాల్లో ప్రతీ కార్డుదారుడికి కిలో కందిపప్పును కూడా ఇస్తారు.
తెలంగాణకు నాఫెడ్ ద్వారా నెలకు 8,754 టన్నుల కందిపప్పు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 3,233 టన్నులు మాత్రమే రావడంతో ముందు నాలుగు జిల్లాల్లో ప్రజలకు ఇచ్చేసి ఆ తర్వాత మిగిలిన మిగిలిన 29 జిల్లాల్లో 15 వ తేదీ తర్వాత అందిస్తారు. .1500 నగదును బ్యాంకు ఖాతాల్లో జమ కాని వారికి పోస్ట్ ఆఫీస్ ఖాతాలో జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నేడు సెలవు కావడంతో రేపటి నుంచి ఇస్తారు.