బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా సంజయ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారనేందుకు ఆధారాలుంటే సమర్పించాలని పోలీసులను న్యాయస్థానం బుధవారం ఆదేశించింది. సంగ్రామ యాత్రకు అనుమతించాలని భాజపా ప్రధాన కార్యదర్శి బంగారు శృతి.. దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.
యాత్రకు అనుమతి లేదని హోంశాఖ, పోలీసుల తరఫు న్యాయవాది శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తరచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని వాదించారు. సంజయ్‌పై ఇప్పటికే 15 కేసులు నమోదు అయ్యాయని విద్వేషపూరిత ప్రసంగాల వీడియో రికార్డులు ఉన్నాయన్నారు. పాదయాత్రకు సంబంధం లేని కేసులను ప్రస్తావిస్తున్నారని భాజపా తరపు న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు.. ఆధారాలు ఉంటే సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ నేటికి విచారణ వాయిదా వేసింది.