బాగ్ అంబర్ పేటలోని నారాయణ కాలేజీలో జరిగిన సంఘటనను విద్యాశాఖ సీరియస్‌గా తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపవద్దని కాలేజీలను ఆదేశించింది ఇంటర్ బోర్డు. నారాయణ కాలేజీ ఘటన నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఈ ఆదేశాలను జారీ చేసింది. కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ స్పష్టం చేశారు.
ఏ కారణంతోనూ విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపొద్దని చెప్పారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే డీఐఈవో లేదా ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. ప్రయివేటు కాలేజీలను తనిఖీలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఉమర్ జలీల్.