కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకన్నా తెలంగాణ‌కే కొంత బెట‌రా..?

-

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌బుత్వం ప్ర‌వేశ పెట్టిన 2020-21 బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు కొంత‌మేర‌కు ఏదో న్యాయం జ‌రిగిందంటే.. జ‌రిగింద‌నే భావ‌న క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న‌, విభ‌జ‌న క‌ష్టాల‌తో అట్టుడుకుతున్న ఏపీకి ఏమీ ఇవ్వ‌లేదు. దీంతో ఏపీతో పోల్చుకుంటే.. త‌మ‌కు కొంతైనా ఉప‌శ‌మ‌నం క‌లిగింద‌నే భావ‌న తెలంగాణ‌లో క‌నిపిస్తోంది. గ్రాంట్ల‌ను ఈ ద‌ఫా 700 కోట్ల మేర‌కు కేంద్రం కేటాయించే అవ‌కాశం క‌నిపిస్తుండ‌డ‌మే బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు ల‌భించిన ఊర‌ట‌గా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. తెలంగాణ‌కూ ఈ బ‌డ్జెట్లో పెద్ద‌గా ఒరిగింది ఏమీ లేద‌నే చెప్పాలి. బడ్జెట్‌ ప్రతిపాదనల్లోనూ రాష్ట్రానికి వచ్చే నిధుల్లో రెండు రకాల నష్టం వాటిల్లింది.

ఒకటి.. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గిస్తూ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించింది. రెండు.. తెలంగాణకు గతంలో 2.437 శాతం వాటాను ఇవ్వగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 2.133 శాతానికి తగ్గించారు. దీనివల్ల కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటాగా రావాల్సిన నిధుల్లో రూ.2,381 కోట్లు తగ్గనున్నాయి. ఈ తగ్గుదల ప్రభావం రాష్ట్ర ప్రగతి ప్రణాళికలపై పడుతుంది.

2019-20కి సంబంధించి కేంద్ర పన్నుల్లో తెలంగాణకు ఇస్తామని ప్రకటించిన వాటాలో రూ.3,731 కోట్లు తగ్గించిన కేంద్రం.. 2020-21లో రూ.16,726 కోట్లు ఇస్తామని ప్రతిపాదిస్తోంది. అంచనాలు సవరించే నాటికి ఎంత తగ్గిస్తారో తెలియదు. దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రగతిశీల నిర్ణయాలూ ప్రకటించలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలేవీ తీసుకోలేదు. అతి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్లో కేటాయింపులను తగ్గించడం పూర్తి ప్రగతి నిరోధక చర్య. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు నిధులు తగ్గించడం దేశ పురోభివృద్ధిపై, సామాజికాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది.

వ్యవసాయ రంగానికి 2019-20 సంవత్సరంలో 3.65 శాతం మేర నిధులు కేటాయించగా, 2020-21లో 3.39 శాతం మాత్రమే కేటాయించారు. వైద్య ఆరోగ్య రంగానికీ 2.24 శాతం నుంచి 2.13 శాతానికి, గ్రామీణాభివృద్ధికి 4.37 శాతం నుంచి 3.94 శాతానికి, విద్యా రంగానికి 3.37 శాతం నుచి 3.22 శాతానికి నిధుల కేటాయింపు తగ్గించారు. దీంతో తెలంగాణ కూడా బాధిత రాష్ట్రంగానే మిగ‌ల‌నుంద‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news