కేంద్ర సర్కార్ దేశవ్యాప్తంగా దళితబంధు ప్రవేశపెట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. దళితబంధుపై దుష్ప్రచారం చేయడం మాని దేశంలో ఉన్న దళితుల ఉన్నతి కోసం ఆలోచన చేయాలని సూచించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తమ మేనిఫెస్టోలో దళితబంధు పెట్టాలని సవాల్ విసిరారు.
దేశంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరగడమే కాక సామాజిక బహిష్కరణలు జరుగుతున్నాయని తెలిపారు. యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు.
భాజపాకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై ప్రేమ ఉండదని కొప్పుల వ్యాఖ్యానించారు. దళితబంధు నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి.. త్వరలోనే అన్ని జిల్లాల్లో దళితబంధుపై సమీక్షలు జరుపుతామని తెలిపారు. భాజపా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే తెలంగాణ విలీన దినోత్సవాన్ని వాడుకోవాలని చూసిందని కొప్పుల విమర్శించారు.