కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర పర్యటన చాలా విచిత్రంగా జరిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆమె తెలంగాణ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని విమర్శించారు. కేంద్ర నిధులు ఉపయోగిస్తే మోదీ ఫొటో పెట్టాలనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఆనాడు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఫొటో పెట్టారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్న సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఫొటో పెట్టారా అని అడిగారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం సబబుగా లేదన్నారు.
కొన్ని పథకాలు లక్ష్యాలు, రాష్ట్రాల ప్రయోజనాలకు తగినట్టు లేవు.. రాష్ట్రానికి వచ్చి 3 విమర్శలు, ఆరు అబద్ధాలు ఆడి రాజకీయం చేస్తానంటే తెలంగాణ సమాజం ఊరుకోదని హరీశ్‌రావు హెచ్చరించారు. ‘తెలంగాణలో మీ పాచిక పారదని బీజేపీ గుర్తించాలి..రాష్ట్ర ప్రజలను మీ అవాస్తవాలతో గందరగోళ పరుద్దామని మీరే గందరగోళంలో పడ్డట్టు అర్థమవుతుందని’ అన్నారు.