- ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తాచాటాలి
- ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు, కార్యకర్తలు అందుకు అనుగుణంగా కృషి చేయాలి
- తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్
హైదరాబాద్ః ఖమ్మం ఇలాకాలో గులాబి జెండా రెపరెపలాడాలనీ, దాని కోసం ఉమ్మడి జిల్లా నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా ఉంటూ ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాజాగా ఆయన ఖమ్మం రాజకీయాలు, జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచి తీరాలనీ, దీని కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లోనూ గులాబి జెండానే ఎగిరి తీరాలనీ, దాని కోసం ఇప్పటిచే ప్రాణాళికలు సిద్ధం చేసి ముందుకు సాగాలని కోరారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు.
మరీ ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకొని మరీ ప్రభుత్వంపై బురద జల్లే చర్యలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు చేసే అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ.. ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దీని కోసం భారీగా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. అందరిని ఏకం చేయాల్సిన బాధ్యత ఖమ్మం ఎమ్మెల్యేలపై ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాగా, ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, రాములు, హరిప్రియానాయక్, ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్‌రా వు, సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్యే చంద్రా వతి తదితరులు పాల్గొన్నారు.