ఉమ్మడి మహబూబ్ నగర్ తాగు, సాగునీటి అవసరాలకు కృష్ణా నీటి విడుదల కోసం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కలిసేందుకు తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుల బృందం చేపట్టిన పర్యటన పై విపక్షాలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నాయి. నారాయణపూర్ జలాశయం నుంచి 5 టీఎంసీల కృష్ణా నీటిని జూరాల ప్రాజెక్ట్ కి విడుదల చేయాలనే అభ్యర్థనతో కర్ణాటకకు వెళ్లారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, మంత్రి బోసు రాజులను కలిసి వినతి పత్రం అందించారు.
జూరాల ప్రాజెక్టు లో ప్రస్తుతం 17 టీఎంసీల నీటి నిలువలు మాత్రమే ఉన్నాయని.. వేసవి కారణంగా నీటి మట్టం వేగంగా డెడ్ స్టోరేజీకి పడిపోతుందని.. దీంతో గద్వాల్, వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని వివరించారు. 30 లక్షల మంది ప్రజలు తాగునీటి కోసం ఈ ప్రాజెక్టు మీదే ఆధారపడి ఉన్నారని తెలిపారు. వెంటనే నీటి ఎద్దడి నివారణకు నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 5 టీఎంసీలు విడుదల చేయాలని సీఎం సిద్దరామయ్యను కోరారు. సీఎంను కలిసిన వారిలో మంత్రులు మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కృష్ణ మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ఉన్నారు.