ఏపీ సర్కారుకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఎమ్మెల్యే…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓ తెలంగాణ ఎమ్మెల్యే ఊహించని షాక్ ఇచ్చారు. శ్రీశైలం ఆలయానికి సంబంధించి దుకాణాలని హిందూ మతస్తులకు కాకుండా ఇతర మతస్తులకు ఇచ్చారని ఆరోపణలు రావడంతో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రంగంలోకి దిగారు. ఆయన ఎంట్రీతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గి దుకాణాల వేలాన్ని కూడా రద్దు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే శ్రీశైలం ఆలయం దగ్గర దుకాణాలకు వేలం పాట ఎప్పుడు సహజంగానే జరుగుతుంది.

ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా శ్రీశైలం దేవస్ధాన పరిధిలోని లలితాంబికా నూతన షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణాల కేటాయింపులపై వేలం పాటలు జరుగుతున్నాయి. అయితే ఈ వేలంలో అధికార పార్టీ అండ ఉన్నవారికి షాపులు దక్కుతాయనేది బహిరంగ రహస్యం. ఇతర పార్టీల వారికి అవకాశం దక్కడం కష్టం. అలాగే ఇవన్నీ అధికార పార్టీ కావాల్సిన వ్యక్తులకే షాపులు కట్టబెట్టింది.

ఇక్కడ వరకు బాగానే ఉన్న ఓ హిందూ ఆలయానికి సంబంధించిన దుకాణాలని అధికార పార్టీ నేతలు, ఇతర మతస్తులకు కూడా షాపులు కట్టబెట్టారు. అక్కడే అసలు వివాదం మొదలైంది. అయితే తమ వారికి దక్కడం లేదన్న కసితో, స్థానిక బీజేపీ నేతలు హిందూత్వ నినాదాన్ని తీసుకు వచ్చారు. ఈ వేలం ప్రక్రియని మొత్తం ఆపేయించడానికి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో నేతృత్వంలోని హిందూ సంస్థలను రంగంలోకి దింపారు.

ఆయ‌న రంగంలోకి దిగ‌డంతో రాష్ట్ర స్థాయిలో ఆయన నేతృత్వంలో హిందూ సంస్థలు, స్వాముల ఆందోళనకి దిగడంతో.. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మొదట్లో ప్రభుత్వం దుకాణాల వేలంలో ఎలాంటి అవతవకలు జరగడం లేదంటూ అధికారులను సమర్ధించిన, తర్వాత సమస్య పెద్దది కావడంతో దుకాణాల వేలం పాటలను రద్దు చేసింది. దీంతో పాటు ఆలయ ఈవోని కూడా బదిలీ చేసింది. బీజేపీ నేతలు ఆలయ ఈవో ముస్లిం అని ఆరోపించడంతో ఆయన్ని కూడా పక్కనబెట్టేసింది.

ఆలయ ఈవో రామచంద్రమూర్తి గతంలో ఆయన చేసుకున్న రెండు పెళ్లిళ్లను సమర్థించుకోవడానికి.. తనకు తాను ఇస్లాం మతంలోకి మారానని గతంలో కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఇప్పుడు అదే ఆయన కొంపముంచింది. మొత్తానికి రాజాసింగ్ దెబ్బకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది అనమాట.

Read more RELATED
Recommended to you

Latest news