Telangana : కొత్త సచివాలయంలో ప్రారంభోత్సవం నుంచే కార్యకలాపాలు

-

రాష్ట్ర పరిపాలనా సౌధం అత్యాధునికంగా సిద్ధమవుతోంది. కొత్త సచివాలయ భవనానికి ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొత్త సచివాలయ భవన ప్రారంభోత్సవం జరగనుంది. ప్రారంభం అయ్యాక అక్కడి నుంచే పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన.

కొత్త సచివాలయం ప్రారంభోత్సవం అయిన మరుసటి రోజు నుంచే రోజువారీ పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రారంభోత్సవానికి ముందే అన్ని శాఖలను కొత్త భవనంలోకి తరలించనున్నారు. సచివాలయంలో పూర్తి స్థాయిలో కొత్త ఫర్నీచర్‌ను వినియోగిస్తున్నారు. కొత్త ఫర్నీచర్‌ ఏర్పాటు చేసే పనులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం నెట్ వర్కింగ్, సంబంధిత పనులు కొనసాగుతున్నాయి.

తరలింపులో భాగంగా కంప్యూటర్లు, దస్త్రాలను మాత్రమే తరలించాల్సి ఉంటుంది. ఇందుకోసం సాధారణ పరిపాలనాశాఖ విధివిధానాలు జారీ చేయనుంది. తరలింపు కోసం ఏజెన్సీలను కూడా ఖరారు చేసి ఆయా శాఖలకు సమాచారం ఇవ్వనున్నారు. ఈ లోగా కొత్త సచివాలయంలో శాఖల వారీగా కేటాయింపు చేయాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ కసరత్తు పూర్తై ఒకటి, రెండు రోజుల్లో కేటాయింపు పూర్తవుతుందని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news