యోగి ప్రభుత్వంపై విజయశాంతి సంచలన ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు హత్యకు గురికావడం, అతీక్ కుమారుడు ఎన్‌కౌంటర్ అయిన ఘటనల్లో సీఎం యోగిగారి ప్రభుత్వాన్ని విపక్షాలు తప్పుబడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నామని తెలిపారు.
ఎన్‌కౌంటర్ వంటి ఘటనల్ని నేను సమర్ధించను కానీ, రాజ్యాంగబద్ధమైన పదవులు నిర్వహించిన అతీక్… ఘోరమైన నేరాలకు పాల్పడి, వందకు పైగా కేసులు ఎదుర్కుంటున్న ఒక గ్యాంగ్‌స్టర్. తనతో పాటు తన కుటుంబ సభ్యుల్ని సైతం క్రిమినల్స్‌గా తయారు చేసి, క్రూరమైన హత్యల్లో సూత్రధారిగా ఉన్న సంగతి యూపీలో అందరికీ తెలుసు. ఇటువంటి వ్యక్తికి యూపీలో ఒకనాడు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ చోటిచ్చి, ఎన్నికల్లో ప్రోత్సహించి, కొన్ని దశాబ్దాల పాటు అతని నేరాలకి ఊతమిచ్చిందన్నారు.
ప్రభుత్వమే అండగా నిలిచిన పరిస్థితుల్లో అతీక్ లాంటి వ్యక్తులకు అంత త్వరగా శిక్ష పడుతుందా? పాలక యంత్రాంగంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితులు ఉత్పన్నమై… అతీక్ లాంటి సంఘవిద్రోహుల బాధితులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే స్థితి చోటు చేసుకుంటోంది. అతీక్ విషయంలో జరిగింది అదే… ఈ ఒక్కటే కాదు, గతంలో తెలంగాణలో జరిగిన దిశ హత్య, అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనలోనూ ఇలాంటి పరిస్థితులు కనబడతాయి. తీవ్ర నేరాల్లో సైతం దోషులకి త్వరగా శిక్షలు పడని పరిస్థితుల్లో… వీరికి చట్టప్రక్రియలకు భిన్నమైన మార్గంలో సత్వర శిక్ష అమలు కావడాన్ని ప్రజల్లోని కొన్ని వర్గాలు ఆమోదిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే, సంఘటనలు జరిగాక మాత్రం అయ్యో చంపేశారంటూ… ఆవేదన వినిపిస్తుంటుంది. ఎక్కడైనప్పటికీ తప్పుచేసినవారికి సత్వరమే శిక్షపడేలా వ్యవస్థల్లో మార్పు చేసుకుంటే అతీక్ లాంటి వ్యక్తులు తయారుకారు… ఎన్‌కౌంటర్ లాంటి పరిస్థితులు చోటు చేసుకోవని తెలిపారు రాములమ్మ.