తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాలు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. ఉదయం 9 గంటలకు ఇళ్ల నుంచి కాలు బయటపెట్టే అవకాశం ఉండటం లేదు. అంతలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటితే కానీ ఎండలు తగ్గడం లేదు. రికార్డ్ స్థాయిలో 45 డిగ్రీలు దాటి టెంపరేచర్స్ నమోదు అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం ఆకాశం మేఘాలతో ఉండీ విభిన్న వాతావరణం కనిపిస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు నిప్పుల కుంపటిలా మారాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ లో శుక్రవారం 45 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదుయ్యాయి. జగిత్యాల జిల్లా ఎండపల్లి, కుమ్రం భీం జిల్లా కెరిమెరిలో రికార్డ్ స్థాయిలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా కద్దం పెద్దూర్ లో 45.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లా కొల్వాయ్ లో 45.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా జైనథ్, కుమ్రం భీం జిల్లా కౌటాలలో 45.4 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు అయింది.