తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు భానుడి భగభగలు రాష్ట్ర ప్రజలను వణికిస్తున్నాయి. ఇక మధ్యాహ్నం పూట బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. పగటిపూట అంతా సూర్యతాపంతో ప్రజలు అల్లాడుతుంటే.. ఇటీవల సాయంత్రం కాగానే వర్షపు జల్లులు చల్లబరుస్తున్నాయి. గత రెండ్రోజుల నుంచి వరణుడు మళ్లీ శాంతించాడు.
అయితే ఈనెల 21 నుంచి 3 రోజుల వరకూ రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసి, పగటి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలున్నాయని వాతావరణశాఖ బుధవారం ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 37 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. దక్షిణ, ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నాయి.
బుధవారం పగలు అత్యధికంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 44.5 డిగ్రీలుంది. మంగళవారం రాత్రి నిజామామాద్, భద్రాచలంలో 27.5 డిగ్రీలుండటంతో ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 నుంచి 3 డిగ్రీలే ఎక్కువగా ఉన్నా ఎండవేడి తీవ్రత అధికం కావడం వల్ల ప్రజలు పగటిపూట బయటికి రావాలంటేనే జంకుతున్నారు.