దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రమేదో తెలుసా..? భారత్‌లో ఎక్కువ హ్యాపీగా ఉండేది ఏ రాష్ట్ర ప్రజలో తెలుసా..? ఇంకెవరు మిజోరాం ప్రజలు. నిజమండీ.. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా సర్వేలో తొలిస్థానం సాధించింది. గురుగ్రామ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన స్టాట్రెజీ ప్రొఫెసర్ రాజేశ్ కె. పిలానియా దీనిపై అధ్యయనం చేశారు. కుటుంబ బంధాలు, సామాజిక సమస్యలు, వృత్తి, మతం, కొవిడ్-19 ప్రభావం, దాతృత్వం అనే ఆరు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని సర్వే అధ్యయనం నిర్వహించారు.
ఈ అంశాలు స్థానిక ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై, ఆనందంపై ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయో పరిశీలించి మిజోరాంను అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా గుర్తించారు. వందశాతం అక్షరాస్యత సాధించిన రెండో రాష్ట్రంగానూ మిజోరానికి గుర్తింపు ఉంది. కుల రహితమైన మిజోరాం సమాజ నిర్మాణం కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. ఆడ, మగ అనే భేదం లేకుండా యువత 16, 17 ఏళ్ల వయసులోనే ఉపాధి పొందుతున్నారు. చిన్న వయసులోనే సంపాదించడాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే వివక్ష లేదు.