దనసరి అనసూయ… మన అందరికి సీతక్కగా పరిచయం. తెలంగాణాలో విపక్ష కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ములుగు నియోజకవర్గానికి ఎంపిక అయిన సీతక్క… ఇప్పుడు కరోనా సమయంలో కష్ట కాలంలో తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా ఆమె సేవలు అందిస్తున్నారు. ములుగు నియోజకవర్గంలో చాలా చోట్లకు రోడ్డు మార్గం ఉండదు.
రోడ్డు మార్గం లేక కాలి నడకన వెళ్ళాలి… అలాగే కాలవలు నదులు దాటుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనితో సీతక్క చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు ఇతరత్రా రవాణా సదుపాయాలతో ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఆదివాసీలు, గొత్తి కోయలు ఇలా అక్కడ భారీగా ఉన్నారు. వీరు అందరికి కూడా ఆమె నిత్యావసర సరుకులను స్వయంగా వెళ్లి అందించడం గమనార్హం.
ఇక ప్రభుత్వం చేసిన ఆర్ధిక సహాయం కూడా వారికి నగదు రూపంలో అందే విధంగా ఆమె చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తో సంబంధం లేకుండా ఆమె ఈ కార్యక్రమం చేస్తున్నారు. అధికారులు వచ్చినా రాకపోయినా సరే వలస కూలీలు, పేదలకు ఆమె సేవలు చేస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే ఆమె ప్రజల్లో ఉంటున్నారు. గత వార౦ రోజుల నుంచి ఆమె రోజులో 10 గంటల పాటు ఎక్కువగా ప్రజల్లోనే ఉంటున్నారు.