తెలంగాణ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రక్రియకు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువు ముగిసేలోగా ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగపరుచుకోవాలని ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ నారాయణగూడలోని అభయహస్తం దరఖాస్తు పంపిణీ కేంద్రాలను పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో పాటు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సందర్శించారు. ఐదు గ్యారంటీలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని వారు తెలిపారు. రేపటితో తొలి దఫా ప్రజాపాలన కార్యక్రమం ముగుస్తుందని అధికారులు చెప్పారు. నాలుగు నెలలకోసారి 8 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. అయితే దరఖాస్తుల విషయంలో దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి వార్డు కార్యాలయంలో పూర్తిస్థాయిలో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ఏవైనా సందేహాలుంటే హెల్ప్ డెస్క్ సిబ్బందిని సంప్రదిచాలని సూచించారు.