ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటీవలే ఈ కేసు విచారణలో బాలకృష్ణ కస్టడీలో ఉన్న సమయంలో ఓ ఐఏఎస్ అధికారి కూడా కేసులో భాగమైనట్లు ఏసీబీ వద్ద ఒప్పుకున్న విషయం తెలిసిందే. సదరు అధికారికి నోటీసులు జారీ చేసి విచారించేందుకు ఏసీబీ అధికారులు న్యాయ సలహా తీసుకుంటున్నారు.
మరోవైపు తాజాగా శివబాలకృష్ణ బినామీలను ఏసీబీ అధికారులు విచారించారు. సత్యనారాయణ, భరత్ ఇద్దరూ.. ఆయనకు బినామీలుగా ఉన్నట్టు ఇప్పటికే గుర్తించిన ఏసీబీ విలువైన భూములు, స్థలాలు వారి పేరు మీద ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం రోజున మరోసారి వీరిని విచారించనున్నారు. కస్టడీ సమయంలో ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు శివ బాలకృష్ణ సరైన సమాధానాలు చెప్పకపోవడంతో.. మరింత లోతుగా అతని బినామీలను ప్రశ్నించాలని నిర్ణయించారు. మరోవైపు ఈ కేసులో మరి కొంత మందిని విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం.