కేసీఆర్‌పై క‌సి తీర్చుకోవ‌డ‌మే ల‌క్ష్యం…సెంటిమెంట్‌కు మంగ‌ళం..!

-

రాజ‌కీయాల్లో పార్టీల‌కైనా.. నాయ‌కుల‌కైనా.. ప్ర‌ధానంగా వ‌ర్క‌వుట్ అయ్యే విష‌యం.. సెంటిమెంట్! ఎన్నిక‌ల స‌మ‌యానికి ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొంది.. దానిని ఓట్లుగా మ‌లుచుకుని అధికారంలోకి వ‌చ్చేందుకు పార్టీలు, నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు. ఈ సెంటిమెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందంటే.. గ‌త ఏడాది ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌ర్నూలు జిల్లాలో ఓ నాయ‌కుడు ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న కాలికి గాయ‌మైంది. దీంతో డాక్ట‌ర్లు.. ఆయ‌న‌ను గ‌డ‌ప దాటొద్ద‌ని, ఇంటి ప‌ట్టునే ఉండాల‌ని.. సూచించారు. మ‌రి ఆ నాయ‌కుడు ఇంటిప‌ట్టునే ఉన్నాడా?  అంటే.. అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ జ‌రిగిన ప్ర‌మాదాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు.

ఓ వాహ‌నంపైనే కొన్ని ఏర్పాట్లు చేయించుకుని దెబ్బ‌తిన్న కాలును చాపుకొని కూర్చొని.. ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి సెంటిమెంటును పండించే ప్ర‌య‌త్నం చేశారు. స‌రే! ఇది వ‌ర్క‌వుట్ అయిందా లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌జ‌ల‌కు-నాయకులకు మ‌ధ్య ఉండే సెంటిమెంటుకు ఇది ఉదాహ‌ర‌ణ‌. ఇక‌, తెలంగాణ‌లోనూ స్థానిక‌త‌ను సెంటిమెంటుగా మ‌లుచుకుని, దూసుకుపోయిన కేసీఆర్‌.. ఎన్ని ప‌క్షాలు ఏక‌మై.. త‌న‌పై దండెత్తినా.. 2018 డిసెంబ‌రులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం కైవ‌సం చేసుకున్నారు. నిజానికి ఆయ‌న ఉప‌యోగించింది కూడా సెంటిమెంటు అస్త్ర‌మే. మ‌రి రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు.. ఇంత ప్రాధాన్యం ఇస్తున్నా.. ప్ర‌స్తుతం అదే తెలంగాణ‌లో జ‌రుగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక‌లో రాజ‌కీయాలు ఈ సెంటిమెంటుకు తెర‌వేసేశాయి!

గ‌తంలో ఎక్క‌డైనా ఒక నియోజ‌క‌వ‌ర్గంలో.. గెలిచిన ప్ర‌జాప్ర‌తినిధి అకాల మ‌ర‌ణం చెందితే.. ఆ ప్లేస్‌లో జ‌రిగిన ఉప పోరుకు.. ఇత‌ర పార్టీలు దూరంగా ఉండేవి. మృతి చెందిన నాయ‌కుడి కుటుంబానికి సానుభూతిగా.. సెంటిమెంటుగా.. ఇత‌ర పార్టీలు సంయ‌మ‌నం పాటించేవి. దీంతో స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏక‌ప‌క్షంగా ఆ కుటుంబం గెలుపు గుర్రం ఎక్కేది. కానీ, తాజాగా దుబ్బాక విష‌యంలో మాత్రం ఈ సెంటి మెంటును ఇత‌ర పార్టీలు పాటించ‌డం లేదు. సీఎం కేసీఆర్‌పై ఉన్న క‌సి, ఆయ‌న పాల‌న‌పై ఉన్న రాజ‌కీయ ద్వేషంతో.. ఆయ‌నపై సాంకేతికంగా, నైతికంగా పైచేయి సాధించాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌తిప‌క్షాలు దుబ్బాక‌లో సెంటిమెంటును ప‌క్క‌న పెట్టాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో దుబ్బాక కాక మొదలైంది. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పోరాడుతున్నాయి.  ఉప ఎన్నిక ఫలితం భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలూ అప్రమత్తమయ్యాయి.  రెండు నెలల క్రితం టీఆర్ ఎస్ కు చెందిన దుబ్బాక సిటింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఆ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సంద‌ర్భాల్లో ఇత‌ర పార్టీలు సంయ‌మ‌నం పాటించి పోటీకి దూరంగా ఉంటాయి. కానీ, కేసీఆర్ దూకుడుకు, ప్ర‌తిప‌క్షాల‌పై ఆయ‌న చిన్న‌చూపు చూస్తున్నార‌నే కార‌ణంగా.. ఇప్పుడు ఈ సెంటిమెంటును ఏ పార్టీ కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని గ‌మ‌నిస్తున్న వారు.. రాను రాను సెంటిమెంటుకు రాం రాం చెబుతున్నారే! అని పెద‌వి విరుస్తుండ‌డం గ‌మ‌నార్హం.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news