కల్వకుంట్ల కుటుంబం అంతా దొంగలేనని విమర్శించారు నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. అసలైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్ అని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొమ్మిది ఏళ్లలో సమస్యలు పెరిగాయన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఎలుకలు, కుక్కలు ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటికో ఉద్యోగం, అమరవీరుల కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అన్నారని.. కానీ అందరినీ మోసం చేశారని ఆరోపించారు. ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినా కోర్ట్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైన్స్ టెండర్స్ మాత్రం పక్కగా జరుగుతాయని ఎద్దేవా చేశారు. దీని మతలబు ఏంటో లిక్కర్ రారాణి చెప్పాలన్నారు. ఈ మధ్య కేసిఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నేనేనన్నారు.
ఇళ్లు కట్టాలంటే హౌసింగ్ శాఖ ఉండాలి.. కానీ ఆది లేనే లేదన్నారు. మరి ఇల్లు ఎవరు కడతారని ప్రశ్నించారు. హౌసింగ్ శాఖలో ఉన్న ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేసారన్నారు. కుల ధ్రువీకరణ పత్రానికే 30రోజుల సమయం కావాలి.. అలాంటిది మూడు రోజుల్లో గృహలక్ష్మికి ఎలా దరఖాస్తు చేస్తారు? అని ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకొని నిజామాబాద్ వచ్చారని కేటీఆర్ ని ప్రశ్నించారు.