నిరుద్యోగులకు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. జీహెచ్ఎంసీలో ఏఎన్ఎంల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,590 ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి ఈనెలలోనే నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. 950 వైద్యుల పోస్టుల్నీ త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు.
మరోవైపు బస్తీ దవాఖానాలు ప్రజల సుస్తీని నయం చేస్తూ దోస్తీ దవాఖానాలుగా మారాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శాసనసభలో ఆదివారం ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు సభ్యులు అడిగి ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘వాటిల్లో 158 రకాల మందుల్ని ఇస్తున్నాం. ప్రస్తుతం చేస్తున్న 57 పరీక్షలను 134కు పెంచేందుకు టెండర్లు పిలిచాం. మార్చి నుంచి ఆయా పరీక్షల్ని చేస్తాం. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ పరీక్షలకు రూ.800 చొప్పున వసూలు చేస్తారు. వాటిని ఇక్కడ ఉచితంగా చేస్తుండటంతో పేదప్రజలకు దాదాపు రూ.12కోట్లు ఆదా అయ్యాయి.” అని మంత్రి హరీశ్ రావు తెలిపారు