జులై మొదటి వారంలో హైదరాబాద్‌లో అన్న క్యాంటీన్‌ సేవలు

-

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రిక అయిన  అన్న క్యాంటీన్‌లు త్వరలో హైదరాబాద్ లో కూడా ప్రారంభం కానున్నాయి. నగరంలోని హైటెక్‌ సిటీ ప్రాంతంలో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్లు సీబీఎన్‌ ఫోరం వ్యవస్థాపకులు జెనెక్స్‌ అమర్‌ తెలిపారు. ఆ దిశగా.. మాదాపూర్‌ 100 ఫీట్‌ రోడ్డులో క్యాంటీన్‌ నిర్మాణ పనులు పూర్తి కావడంతో శనివారం రోజున జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు ఎందరో పేదల ఆకలి తీర్చి వారి ఆదరణ పొందాయని అమర్ అన్నారు. చంద్రబాబు స్ఫూర్తితో తెలంగాణలో సైతం అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఈ క్యాంటీన్ ద్వారా జులై మొదటి వారంలో రోజూ పేదలకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో చంద్రబాబు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సీబీఎన్‌ ఫోరం తరఫున కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇక అంతకుముందు రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు చిత్రపటానికి ఫోరం సభ్యులు నివాళులర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news