బాసర ఐఐఐటీలో మరో విద్యార్థిని మృతి కలకలం సృష్టించింది. పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న లిఖిత అర్ధరాత్రి 2 గంటల సమయంలో వసతి గృహం పైనుంచి పడి మరణించింది. వెంటనే ఆమెను క్యాంపస్ హెల్త్‌సెంటర్‌లో ప్రథమచికిత్స చేసి… భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా… లిఖిత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థిని మరణం ప్రమాదమా, ఆత్మహత్య అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న విద్యార్థిని లిఖిత మృతదేహాన్ని ఆర్జీయూకేటీ ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ పరిశీలించారు. లిఖిత మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘‘విద్యార్థిని మృతి దురదృష్టకరమని….. లిఖిత మరణం ప్రమాదవశాత్తు జరిగిందంటూ తెలిపారు. ఆర్జీయూకేటీలో మరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని….. విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దని ఇంఛార్జ్ వీసీ పేర్కొన్నారు. మరోవైపు ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి ఆరోపించారు.