హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. కల్యాణమహోత్సవం సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాలు నిన్న (సోమవారం) గణపతి పూజతో ప్రారంభం అయిన విషయం తెల్సిందే. మూడు రోజుల పాటు సాగనున్న ఈ ఉత్సవాలు బుధవారంతో ముగియనున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు మహాశాంతి చండీహోమం, సాయంత్రం 6 గంటలకు రథోత్సవం జరగనుంది. రథోత్సవంలో భాగంగా అమ్మవారిని రథంపై ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగిస్తారు. ఇక ఆషాడ బోనాలు సందర్భంగా జులై 25, 26 న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు జరగనున్నాయి. ఈ లష్కర్ బోనాలకు రావాల్సిందిగా ఆలయ అధికారులు, వేద పండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అరణ్య భవన్ లో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.