తెలంగాణలో రామరాజ్యం తీసుకువస్తా – బండి సంజయ్

తెలంగాణలో రామరాజ్యం తీసుకువస్తానని బిజేపి చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా నందన్ గ్రామం, నర్సాపూర్ మండలం రాంపూర్ గ్రామాల్లో సాయంత్రం పాదయాత్ర చేపట్టారు. లిక్కర్ స్కామ్ లో కెసిఆర్ బిడ్డకు నోటీసులు ఇస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకు కుట్ర చేస్తున్నారు. అడ్డంగా దొరికిన బిడ్డ కోసం తెలంగాణ ప్రజలు ఎందుకు ఉద్యమించాలి? ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, టిఆర్ఎస్ నేతలు అవినీతి, అక్రమాల్లో నిండా మునిగిపోయారని ఈ సందర్భంగా బండి సంజయ్ పేర్కొన్నారు.


రాష్ట్ర మంత్రులు, టిఆర్ఎస్ నేతల భూకబ్జాల చిట్టా మా వద్ద ఉంది. బిజెపి అధికారంలోకి రాగానే ఆ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతాం. దళిత బంధు అడిగితే పేద మహిళలపై నాన్ బేయిలేబుల్ కేసులు పెట్టిస్తారా? దళితులపై దాడి చేయించిన స్థానిక మంత్రి, బాధ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తా. వీటన్నిటికీ వత్తాసు పలుకుతూ, అధికార పార్టీ నాయకుల మోచేతి నీళ్లు తాగే కొంతమంది పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దమ్ముంటే ఇక్కడి సీఐ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. నర్సాపూర్లో జూనియర్ కాలేజీ కూడా ఇవ్వని దద్దమ్మ కేసీఆర్. ప్రాణహిత చేవెళ్ల నిర్వాసితులకు పైసా కూడా ఇవ్వలేదు. రైతు రుణమాఫీ చేయలేదన్నారు. కేసీఆర్ కబంధ హస్తాల్లో తెలంగాణ తల్లి బందీ అయింది. తెలంగాణ తల్లిని బంధ విముక్తురాలిని చేద్దాం… తెలంగాణలో రామరాజ్యం స్థాపిద్దాం…. గొల్లకొండపై కాషాయపు జెండాను ఎగరేద్దామని స్పష్టం చేశారు బండి సంజయ్.