ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘అమృత్’పై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి. ఇందులో అవినీతి బయటకు రావాలంటే సీవీసీ విచారణ కోరాలి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఈ పథకం ప్రయోజనాలు ప్రజలకు అందకుండా చేస్తున్నాయి. ఈ పథకంలో అవినీతి జరిగిందని ఈ రెండూ పార్టీలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు గుప్పించుకుంటూ డ్రామాలాడుతున్నాయి.
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా వీరిద్దరూ ఈ పథకంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడి, తమకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించుకొని, పెద్దఎత్తున కమీషన్లు కొట్టేశారన్నది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే దీనిపై విచారణ జరిపేందుకు సీవీసీని ఒప్పించేలా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో నేను వ్యక్తిగతంగా చొరవ చూపుతాను. తెలంగాణలో అమృత్ పథకం సక్రమంగా అమలవుతుందని, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని, కాంట్రాక్టు కట్టబెట్టడంలో పక్షపాతం చూపలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే తక్షణమే సీవీసీకి లేఖ రాయాలి. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్టు భావించాల్సి వస్తుంది. 6 గ్యారంటీల అమలులో వైఫల్యం, హైడ్రా కూల్చివేతల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘అమృత్’ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని స్పష్టమవుతోంది అని బండి సంజయ్ పేర్కొన్నారు.