ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ..కారణం ఇదే

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేసిన సంజయ్….ఈ రెండు అంశాలపై విచారణ జరిగితే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర దర్యాప్తు సంస్థలు చేపడుతున్న విచారణలో సమగ్రత, చిత్తశుద్ధి లోపించినట్లు కన్పిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తెలంగాణ ప్రతిష్ట మసకబారింది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ప్రత్యేక హక్కులను మంట కలిపారు. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కూడా కాలరాశారని వెల్లడించారు.

Bandi Sanjay’s letter to Chief Minister Revanth Reddy.jpg

భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు ఫోన్ లో మాట్లాడుకునే అంశాలను కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినడం ద్వారా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. విపక్షాల అణచివేత కోసం ఫోన్ ట్యాపింగ్ ద్వారా సైబర్ దాడికి తెగబడటం సహించరాని విషయం. ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వాధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన కుమారుడు కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని విచారణలో వెలుగు చూసినా ఇంతవరకు వారికి కనీసం నోటీసులు ఇవ్వకపోవడాన్ని చూస్తుంటే రాష్ట్ర దర్యాప్తు సంస్థల పనితీరు పలు అనుమానాలకు తావిస్తోందని ఫైర్‌ అయ్యారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మీడియాకు లీకులివ్వడమే తప్ప అధికారికంగా ఏం జరుగుతుందో ఇప్పటి వరకు వెల్లడించకపోవడం చూస్తుంటే రాష్ట్ర దర్యాప్తు సంస్థల విచారణపై నెలకొన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. మాకు అందుతున్న సమాచారం ప్రకారం… రాజకీయ ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతోపాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా పూర్తిస్థాయిలో విచారణ జరపకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు కూడా మారినట్లు తెలిసిందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news