భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. కల్యాణం సెక్టార్ టికెట్లు ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. శ్రీరామనవమి రోజు ఉభయ దాతల టికెట్ రుసుము రూ.7,500 కాగా దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుందని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లపై ఒక్కరికి ప్రవేశం కల్పించనున్నట్లు చెప్పారు. 18వ తేదీన పట్టాభిషేక మహోత్సవం సెక్టార్ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించినట్లు వెల్లడించారు. వీటిని https:-//bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని పేర్కొన్నారు.
మరోవైపు కల్యాణం రోజున ప్రత్యక్షంగా రాలేని భక్తులు పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలతో పూజ చేయించుకునే వెసులుబాటునూ కల్పించారు. దీనికోసం రూ.5 వేలు, రూ.1116 టికెట్లనూ ఇదే వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా సెక్టార్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఏప్రిల్ 1 నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు రామాలయ కార్యాలయం (తానీషా కల్యాణ మండపం)లో తమ ఒరిజినల్ ఐడీ కార్డులను చూపించి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని ఈవో వెల్లడించారు.