బిజెపి అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సికింద్రాబాద్ చేరుకున్న అమిత్ షా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేసిన అనంతరం సికింద్రాబాద్ లోని సాంబమూర్తి నగర్ లోని పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త ఎన్. సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అమిత్ షాను చూడగానే ఉబ్బితబ్బిబ్బై సత్యనారాయణ కళ్లలో ఆనందభాష్పాలు రాలాయి.
‘’ సార్.. 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నా… మీ అంత గొప్ప నాయకుడు నాలాంటి సామాన్య కార్యకర్త ఇంటికి రావడం నా అద్రుష్టం. నా జన్మధన్యమైంది. మరింత కష్టపడి పనిచేస్తా’’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 8 ఏండ్లుగా దళితులను దారుణంగా మోసం చేశారని సత్యనారాయణ వాపోయారు. ‘‘దళితుడికి సీఎం పదవి ఇస్తానన్న హామీని గాలికొదిలేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీ అమలు కాలేదు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ది పొందాలని తెచ్చిన దళిత బంధు పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు. కేసీఆర్ దురాగతాలపై పోరాటం చేసిన తనపై అక్రమంగా కేసులు నమోదు చేసి వేధించారు. సీఎం కేసీఆర్ పాలనను అంతమొందిస్తేనే దళితులకు న్యాయం జరుగుతుంది.’’అని అభిప్రాయపడ్డారు. సత్యనారాయణ చెప్పిందంతా సానుకూలంగా విన్న అమిత్ షా… ‘‘ప్రతి కార్యకర్త ఇంట్ల నేనుంటా…మీరంతా ధైర్యంగా కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై కొట్లాడండి‘’’ అని భరోసా ఇస్తూ కిషన్ రెడ్డి, బండి సంజయ్, తరుణ్ చుగ్ లతో కలిసి బేగంపేట ఎయిర్ పోర్టుకు బయలు దేరారు.